MPs’ Housing Complex | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్‌లో ఎంపీల కోసం కొత్తగా నిర్మించిన హౌసింగ్ కాంప్లెక్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త హౌసింగ్ కాంప్లెక్స్‌లో 184 మంది ఎంపీలు సేద తీరనున్నారు. ఇక వీరందరికి అధునాతన సదుపాయాలతో, సరికొత్త హంగులతో ఇండ్లను నిర్మించి ఇచ్చారు. నాలుగు టవర్లలో 23 ఫ్లోర్లను ఏర్పాటు చేశారు. 184 ప్లాట్లను నిర్మించారు. ప్రతి ఫ్లాట్ 5 వేల చదరపు అడుగుల్లో నిర్మించారు.
ఒక్కో ఫ్లాట్ ఐదు బెడ్రూమ్స్ను కలిగి ఉంది. ప్రతి బెడ్రూమ్కు అటాచ్డ్ డ్రెస్సింగ్ రూమ్స్, బాత్రూమ్స్ కలిగి ఉన్నాయి. ఫ్యామిలీ లాంగ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి రూమ్‌కు, ప్రతి ఆఫీసు గదికి బాల్కనీ వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పూజా గదిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కిచెన్ ఏరియా విశాలంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. కూకింగ్ హబ్స్, చిమ్నీలను కూడా ఏర్పాటు చేశారు.
ఎంపీకి ఒక ఆఫీసు, ఆయన అసిస్టెంట్‌కు మరో ఆఫీసు గదిని ఏర్పాటు చేయడంతో ప్రత్యేకంగా అటాచ్డ్ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేశారు. ఎంపీలకు సేవలందించే స్టాఫ్ కోసం ప్రత్యేక రెండు క్వార్టర్లను నిర్మించారు. స్టాఫ్, ఎంపీలు, వారి అసిస్టెంట్లు వెళ్లేందుకు ప్రత్యేక ఎంట్రెన్స్‌లు ఏర్పాటు చేశారు.
ప్రతి ఫ్లాట్‌కు డబుల్ గ్లేజ్డ్ యూపీవీసీ కిటికీలు, ఆఫీసు, బెడ్రూమ్స్లో వుడెన్ ఫ్లోరింగ్, సెంట్రల్ ఎయిర్ కండీషన్ ఏర్పాటు చేశారు. వీడియో డోర్ ఫోన్స్, వైఫై, సెంట్రలైజ్డ్ కేబుల్ టీవీ, ఈపీఏబీఎక్స్ టెలిఫోన్స్, నేచురల్ గ్యాస్, ఆర్వో వాటర్, రిఫ్రిజిరేటర్లు వంటి సదుపాయాలు కల్పించారు.
ప్రతి క్వార్టర్‌కు దుకాణ సముదాయాలు, డిస్పెన్సరీ, కమ్యూనిటీ హాల్, క్యాంటీన్, క్లబ్, జిమ్, యోగా రూమ్స్, అథితులకు వసతి సౌకర్యాలు కల్పించారు. 612 వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు సదుపాయాలు కల్పించారు. ఇక ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.