న్యూఢిల్లీ, ట్రెహాన్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులను భారత్ ఖండించాలని ఇరాన్ దౌత్యవేత్త కోరారు. ఇరానియన్ ఎంబసీ మిషన్ డిప్యూటీ చీఫ్ జావెద్ హొస్సేనీ మాట్లాడుతూ భారత్ అధికారులతో తాము చర్చలు జరిపామని, అయితే ఇజ్రాయెల్, ఇరాన్ విషయంలో భారత్ తటస్థ వైఖరితో ఉందని అన్నారు. ఎందుకంటే రెండు దేశాలతోనూ భారత్‌కు మంచి సంబంధాలున్నాయన్నారు.
అయితే ఇది ఒక దేశానికి సంబంధించిన దురాక్రమణ విషయమని, అంతర్జాతీయ చట్టం ప్రకారం దానిని ఖండించాలని అన్నారు. గ్లోబల్ సౌత్‌కు ఇండియా లీడర్ అని, ఇజ్రాయెల్ దాడులను న్యూఢిల్లీ వ్యతిరేకించాలని ఇరాన్ ఆశిస్తోందని, భారత్‌తో పాటు ప్రతి దేశం ఇజ్రాయెల్ దాడులను ఖండించాలని ఆయన కోరారు. కాగా, మధ్య ప్రాచ్యంలో శాంతి ప్రక్రియకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు పెద్ద ఆటంకంగా మారారని తుర్కియే అధ్యక్షుడు శనివారం రెసెప్ ఎర్డోగాన్ ఆరోపించారు.
ఇరాన్‌తో అమెరికా మరో విడత అణు శాంతి చర్చలు జరిపే ముందు ఆ దేశంపై దాడులు జరపడం చర్చల ప్రక్రియకు విఘాతం కలుగుతుందని, శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావడం ఇజ్రాయెల్ అధ్యక్షుడిని ఇష్టం లేనట్టు కన్పిస్తున్నదని ఆయన విమర్శించారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని త్వరగా ముగించాలని అరబ్ ఎమిరేట్స్ సీనియర్ అధికారి ఒకరు విజ్ఞప్తి చేశారు. యుద్ధం ఇలాగే కొనసాగితే కష్టతరమైన పరిణామాలు ఏర్పడుతాయని అన్నారు. ఈ యుద్ధం సంపద ఉన్న గల్ఫ్ ప్రాంతాన్ని వెనక్కి నెట్టేస్తున్నదని యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గష్ అన్నారు.
యుద్ధం నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధు కింద శనివారం నాటికి 500 మందికి పైగా భారతీయులను ఇరాన్ నుంచి మన దేశానికి తీసుకువచ్చినట్టు భారత విదేశాంగ శాఖ మంత్రి ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ తన పౌరులందరినీ ఇరాన్ నుంచి తరలిస్తున్నదని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.