DK Shivakumar : కాంగ్రెస్ పార్టీ (Congress party) అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కర్ణాటక పర్యటనతో ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి చర్చనీయాంశమైంది. సిద్ధరామయ్య (Siddaramaiah) ను తప్పించి డీకే శివకుమార్ (DK Shivakumar) కు సీఎం పగ్గాలు అందిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ ఆ ప్రచారానికి మరింత చేకూర్చుతోంది.
‘ప్రయత్నాలు విఫలమైనా.. ప్రార్థనలు ఎన్నటికీ విఫలం కావు’ అంటూ డీకే తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. దాంతో ఆ పోస్టు రాష్ట్రంలో సీఎం మార్పును ఉద్దేశించేనని, ఆ విషయాన్నే ఆయన తన పోస్టులో పరోక్షంగా తెలియజేశారని ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా రాహుల్‌గాంధీ మంగళవారం మైసూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితర నేతలతో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. రాష్ట్రంలో అధికార పంపిణీ వ్యవహారంపైనే వారు చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ అంశంపై స్పష్టతనివ్వాలనే ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య రాహుల్ గాంధీని కోరినట్లు సమాచారం. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు రెండున్నరేళ్లపాటు పదవిలో కొనసాగేలా అంగీకారానికి వచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలను ఖండిస్తూ ఐదేళ్లు తానే సీఎంగా ఉంటానని సిద్ధరామయ్య పలుమార్లు స్పష్టంచేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే ఆశ తనకు ఉందనే అర్థం వచ్చేలా డీకే కూడా వ్యాఖ్యలు చేశారు.