Karnataka | హైదరాబాద్, సెప్టెంబర్ 17 (స్పెషల్ టాస్క్ బ్యూరో- నమస్తే తెలంగాణ): కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం చేపట్టి పట్టుమని నాలుగు నెలలు కాలేదు. ఇప్పటికే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు గుప్పుమనడంతోపాటు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా రాజుకొంటున్నది. మరోవైపు కుర్చీలాట ఎలాగూ ఉండనే ఉన్నది. ఎన్నికల ఫలితాల విడుదలైన రోజు నుంచి సీఎంగా సిద్ధరామయ్యను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసే వరకు సిద్ధరామయ్య, మరో సీనియర్ నేత డీకే శివకుమార్‌ల మధ్య సీఎం కుర్చీ ఆట సాగిన విషయం తెలిసిందే.
సిద్ధరామయ్య నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ ఆటకు శుభం కార్డు పడలేదు. సీఎం పదవి ఆశించి భంగపడ్డ డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంలో రెండో అధికార కేంద్రంగా మారారు. ఇద్దరి నేతల వర్గాలు అంతర్గతంగా ఒకరిపై ఒకరు వ్యూహాలు రచించుకొనే పనిలో పడ్డాయి.
ఈ క్రమంలో డీకేకు చెక్ పెట్టేందుకు సీఎం సిద్ధరామయ్య సిద్ధమయ్యారని, ఇందుకు ‘మరో ముగ్గురు డిప్యూటీ సీఎంలు’ అస్ర్తాన్ని ఎంచుకొన్నారనే చర్చ తాజాగా కర్ణాటక రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నది. మరో ముగ్గురికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలన్న ప్రతిపాదనను సీఎం సిద్ధరామయ్య వర్గం తాజాగా తెరపైకి తీసుకొస్తున్నది. భవిష్యత్తులో డీకే శివకుమార్ నుంచి తన సీఎం సీటుకు ఎసరు రాకుండా సిద్ధరామయ్యనే ముగ్గురు డిప్యూటీ సీఎంల ప్రతిపాదన చేయించి ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల సాకుతో డీకేకు సెగ
కర్ణాటకలో బలమైన సామాజికవర్గమైన లింగాయత్తోపాటు ఎస్సీ/ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి ముగ్గురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అన్ని ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడైన సహకారశాఖ మంత్రి రాజన్న పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనపై తానేమీ మాట్లాడనని అంటూనే పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సిద్ధరామయ్య వ్యాఖ్యానించడం కర్ణాటక కాంగ్రెస్ రాజకీయవర్గాల్లో నెలకొన్న అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్టయింది. సిద్ధరామయ్యకు తెలియకుండానే ఈ ప్రతిపాదన ముందుకొచ్చే అవకాశం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు.
సీఎం సీటు చేజారకుండా ప్లాన్
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం పదవిని బలంగా ఆశించిన వక్కలిగ వర్గానికి చెందిన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఒక్కరికే కాంగ్రెస్ అధిష్ఠానం డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల ఓట్ల కోసం బీసీ వర్గానికి చెందిన సిద్ధరామయ్యకు సీఎం సీటును కట్టబెట్టిందన్నది బహిరంగ రహస్యమే. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత లేదా రెండున్నర ఏండ్ల అనంతరం సీఎం సీటును ఇచ్చే విధంగా అధిష్ఠానం డీకేను ఒప్పించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ అంతర్గత ఒప్పందం బహిర్గతం కావడంతో కర్ణాటక ప్రభుత్వం సీఎం, డిప్యూటీ సీఎం వర్గాలుగా చీలింది. ప్రస్తుతం డీకే డిప్యూటీ సీఎంగా, కేపీసీసీ అధ్యక్షుడిగా జంట పదవులు నిర్వహిస్తుండటంతో ఆయన రెండో అధికార కేంద్రంగా మారారు. ఈ పరిస్థితికి ఆదిలోనే చెక్ పెట్టే వ్యూహంతో సీఎం సిద్ధరామయ్య వర్గం తాజాగా మరో ముగ్గురు డిప్యూటీ సీఎంల ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.