న్యూఢిల్లీ: 6 నుంచి 14 ఏండ్లలోపు పిల్లలకు ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను హామీ ఇస్తూ, బోధన, మౌలిక వసతులకు సంబంధించిన కొన్ని ప్రమాణాలను నిర్దేశించిన విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ) అమల్లోకి వచ్చి 16 ఏండ్లు గడిచినా విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా అందడం లేదు. ఆర్టీఈ చట్టం అమలు, విద్యా సౌకర్యాల లభ్యతను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది అశోక్ అగర్వాల్ నేతృత్వంలోని పౌర హక్కుల సంస్థ సోషల్ జ్యూరిస్ట్ కార్యకర్తల బృందం ఆగస్టు 1న రాజస్థాన్లోని డీగ్ జిల్లా అమ్రుకా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించింది. ఆర్టీఈ చట్టం ప్రకారం ప్రాథమిక తరగతుల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, ప్రాథమికోన్నత తరగతుల్లో ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి.
బాలురు, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉండాలి. అమ్రుకా పాఠశాలలో ఒకే తరగతి గదిలో 90 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఏండ్ల క్రితం నిర్మించిన మరుగుదొడ్లు నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. ఉపాధ్యాయుల ఖాళీలు, భవనాల్లో పగుళ్లు, పనిచేయని మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాల కొరతకు వ్యతిరేకంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రల్లోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు క్యాంపస్లలో నిరసనలు చేపడుతున్నారు. 97 శాతం పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నప్పటికీ నిర్వహణ లేక అవి ఉపయోగించలేని స్థితికి చేరుకున్నాయని ఉత్తరప్రదేశ్ ప్రాథమిక శిక్షా మిత్ర సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు త్రిభువన్ సింగ్ చెప్పారు.
2025-26 యూడైస్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా లక్షకు పైగా పాఠశాలలను ఒక్క ఉపాధ్యాయుడితో నిర్వహిస్తున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు అత్యధికంగా ఏపీలో 16,357, జార్ఖండ్లో 9,827, మహారాష్ట్రలో 9,269, కర్ణాటకలో 8,042, ఉత్తరప్రదేశ్లో 7,874 ఉన్నాయని ఆర్టీఈ ఫోరం సమన్వయకర్త మిత్రరంజన్ తెలిపారు. ‘పేద కుటుంబాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వస్తారని ప్రభుత్వానికి తెలుసు. వారి విద్యపై ఖర్చు చేయాలని ప్రభుత్వం కోరుకోవడం లేదు. స్థోమత ఉన్న వాళ్లు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపాలని ప్రభుత్వం కోరుకుంటున్నది” అని అగర్వాల్ అన్నారు.