న్యూఢిల్లీ : ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానం ప్రవేశపెట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మరో నిర్వాకం వెలుగు చూసింది. 12వ తరగతికి ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఓఎస్ఎం విధానంలో అర్హత గల ఉపాధ్యాయులతో కాకుండా 10వ తరగతి టీచర్లతో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించారు. ఢిల్లీ పేరెంట్స్ అసోసియేషన్‌కు చెందిన అపరాజిత గౌతమ్ దీనికి సంబంధించిన పలు నిజాలను వెల్లడించారు.
వాస్తవానికి ఈ జవాబు పత్రాలను పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీలు)తో మూల్యాంకనం చేయించాలని, అయితే వారి కొరత కారణంగా, 10వ తరగతి విద్యార్థుల వరకు మాత్రమే బోధన చేసే సామర్థ్యమున్న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీలు)తో 12వ తరగతి పేపర్లు మూల్యాంకనం చేయించారని ఆమె ఆరోపించారు. వారికి ఇచ్చిన శిక్షణ కూడా ఆదరాబాదరాగా నిర్వహించారని, కొన్ని శాంపిల్ పేపర్లు మాత్రమే దిద్దించి చేతులు దులుపుకున్నారని, అర్హత లేని ఉపాధ్యాయులతో జవాబుపత్రాల మూల్యాంకనం చేయించి 12వ తరగతి విద్యార్థుల భవిష్యత్‌ను పణంగా పెట్టారన్నారు.