న్యూఢిల్లీ: మణిపూర్ హింస(Manipur violence)పై యురోపియన్ యూనియన్ పార్లమెంట్లో చర్చించనున్నారు. ఆ అంశంపై ఈయూలో తీర్మానాన్ని బుధవారం ప్రవేశపెట్టారు. ఆ ప్రతిపాదిత తీర్మానాన్ని ను భారత్ ఖండించింది. ఇది తమ అంతర్గత సమస్య అని ఈయూ పార్లమెంటేరియన్లకు తేల్చి చెప్పినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. బ్రసెల్స్‌లో జరుగుతున్న ఈయూ సమావేశాల్లో బుధవారం మణిపూర్ పరిస్థితిపై తీర్మానం ప్రవేశపెట్టారు. నిజానికి ఇవాళ ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన చేపడుతున్న నేపథ్యంలో ఆ తీర్మానాన్ని తీసుకువచ్చారు.
తీర్మానం ప్రవేశపెట్టి ఈయూ నేతలకు మణిపూర్ సంక్షోభాన్ని వివరించినట్లు విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. ఇది అంతర్గత సమస్య అని వాళ్లకు తేల్చి చెప్పినట్లు ఆయన వెల్లడించారు. గత రెండు నెలల నుంచి మణిపూర్‌లో వర్గ హింస చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. కుక్కిలు, మైటీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఆ హింసలో అనేక మంది చనిపోయారు. కోట్లల్లో నష్టం వాటిల్లింది. హింసను అదుపు చేయడంలో బీజేపీ సర్కార్ విఫలమైనట్లు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
ఈయూ పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలను భారత ప్రభుత్వం గమనిస్తున్నట్లు వినయ్ క్వాత్రా తెలిపారు. మణిపూర్ హింసపై ఆందోళన చెందుతున్న ఈయూ నేతల్ని కలిశామని, అయితే వారికి తమది అంతర్గత సమస్య అని స్పష్టం చేసినట్లు ఆయన చెప్పారు. బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న జాతీయవాద విధానాలను ఈయూ పార్లమెంటేరియన్లు తీవ్రంగా విమర్శించారు. మానవ హక్కులకు, ప్రజాస్వామ్య విలువలకు భారత సర్కార్ ప్రాధాన్యం ఇవ్వాలని ఈయూ నేతలు కోరారు.