న్యూఢిల్లీ, నవంబర్ 25: వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇథియోపియాలోని అగ్ని పర్వతం (హేలీ గుబ్బీ) విస్ఫోటం నుంచి వెలువడుతున్న పొగ, ధూళి, బూడిద మంగళవారం భారతదేశాన్ని తాకాయి. భారత భూభాగంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఆ పొగ విస్తరించటంతో.. పదుల సంఖ్యలో విమాన సర్వీసుల్ని అధికారులు రద్దుచేశారు. మరికొన్ని చోట్ల ఆలస్యంగా నడుపుతున్నట్టు పౌర విమానయాన శాఖ తెలిపింది. విస్ఫోటం అనంతరం పరిస్థితులను అత్యంత దగ్గర్నుంచి పరిశీలిస్తున్నామని, వాతావరణం, గాలి నాణ్యత పెద్దగా ప్రభావితం కాలేదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ‘హేలీ గుబ్బీ’ నుంచి వెలువడుతున్న పొగ మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో భారత్ నుంచి దూరంగా వెళ్తున్నదని, చైనా దిశగా కదులుతున్నదని ఐఎండీ పేర్కొన్నది.