న్యూఢిల్లీ: వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు త్వరలో ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. త్వరలోనే ఇథనాల్ ఆధారిత వంట పొయ్యిని అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రెయిన్ ఇథనాల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (జీఈఎంఏ) ప్రెసిడెంట్ సీకే జైన్ మాట్లాడుతూ.. ఇథనాల్ తయారీదారులు వాణిజ్య అవసరాల కోసం ఈ వంట పొయ్యిపై పని చేస్తున్నారని, దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించారని తెలిపారు. పంపిణీ, రీఫిల్లింగ్ వంటి కొన్ని ప్రారంభ సవాళ్లు ఉన్నాయని, వాటిపై ప్రస్తుతం పని జరుగుతున్నదని, అవి పరిష్కారం అయిన తర్వాత వాణిజ్యపరంగా దీనిని ఉపయోగించడం ప్రారంభించవచ్చని అన్నారు.
“వాణిజ్య అవసరాల కోసం ఎల్పీజీ స్థానంలో ఇథనాల్‌ను ఉపయోగించవచ్చు. ఇది ముడి చమురుపై ప్రస్తుతం ఆధారపడుతున్న దానిలో దాదాపు 15 శాతంగా ఉంది. ఆ 15 శాతం దిగుమతిని తగ్గించుకున్నా అది పెద్ద విజయమే అవుతుంది” అని జైన్ చెప్పారు. భవిష్యత్తులో వచ్చే ఇంధన షాక్‌ల నుంచి, పెరుగుతున్న ముడి చమురు ధరల నుంచి భారత్ తనను తాను రక్షించుకోవాలని చూస్తున్న తరుణంలో, దేశం దీర్ఘకాలిక ఇంధన పరివర్తన వ్యూహంలో ఇథనాల్ బ్లెండింగ్ కీలకమైన అంశంగా ఉంటుందని అన్నారు. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ముడి చమురు సరఫరా సంక్షోభం కారణంగా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి.