హైదరాబాద్, సెప్టెంబర్ 19: తప్పనిసరి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచడాన్ని ఈపీఎఫ్వో తెలంగాణ జోనల్ కార్యాలయం, రాష్ట్రంలోని ప్రాంతీయ కార్యాలయాలు స్వాగతించాయి. ఈనెల 17 నుంచి అమల్లోకి వచ్చిన ఈ వేతన పరిమితి పెంపుదల చట్టబద్ధ సామాజిక భద్రతా స్వరూపంలో ఒక ముఖ్యమైన విస్తరణతోపాటు తప్పనిసరి ఈపీఎఫ్ఓ పరిధిలోకి దేశవ్యాప్తంగా మరో 51 లక్షల మందికిపైగా ఉద్యోగులను తీసుకువచ్చే గొప్ప మార్పని తెలంగాణ జోనల్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నది.
తప్పనిసరి ఈపీఎఫ్వో పరిమితి సవరణ చివరిసారి 2014 సెప్టెంబర్లో జరిగిందని, అప్పుడు పరిమితిని రూ.15,000కు పెంచడం జరిగిందని ఈపీఎఫ్వో పేర్కొన్నది. ఆ తర్వాత వేతనాలు, ఆదాయాలు, కనీస వేతనాలు, జీవన వ్యయం గణనీయంగా పెరిగాయని, అదే సమయంలో వ్యవస్థీకృత రంగంలో ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని తెలిపింది. వేతన పరిమితి పెంపుదలతో తప్పనిసరి ఈపీఎఫ్ పరిధిలోకి రూ.15,000-రూ.25,000 వేతనాలు పొందుతున్న ఉద్యోగులు కొత్తగా వస్తారని, ఇది వారికి మరింత ఎక్కువ సామాజిక భద్రతను కల్పిస్తుందని ఈపీఎఫ్వో తెలిపింది.
ప్రావిడెంట్ ఫండ్ ఖాతా అంటే కేవలం పొదుపు ఖాతా మాత్రమే కాదని, ఈపీఎఫ్వో నిర్వహించే మూడు ప్రధాన పథకాల ప్రయోజనాలు కూడా పొందవచ్చని తెలిపింది. దీర్ఘ్ఘకాలిక రిటైర్మెంట్ పొదుపును సమకూర్చే ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్), పింఛను సంబంధించిన సామాజిక భద్రతా రక్షణను కల్పించే ఉద్యోగుల పింఛను పథకం(ఈపీఎస్), ఉపాధితో ముడిపడిన బీమా రక్షణ కల్పించే ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ బీమా పథకం(ఈడీఎల్ఐ) వంటి ప్రయోజనాలకు కొత్తగా ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే సభ్యులు అర్హులవుతారని ఈపీఎఫ్ఓ పేర్కొన్నది..
అందువల్ల వేతన పరిమితి పెంపు ఉద్యోగికి చెందిన శాలరీ స్లిప్పులో నెలవారీ పీఎఫ్ చెల్లింపు మొత్తంగా మాత్రమే గాక రిటైర్మెంట్ పొదుపు, పింఛన్ రక్షణ, బీమా భద్రతను కల్పించే విస్తృత సామాజిక భద్రతా వ్యవస్థగా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నది.. ప్రతినెలా తప్పనిసరిగా ఉద్యోగి జీతం నుంచి చెల్లించే పీఎఫ్ మొత్తంతోపాటు యాజమాన్యం చెల్లించే మొత్తం కూడా కలుపుకుంటే రిటైర్మెంట్ సమయానికి వడ్డీతో కలుపుకుని పెద్దమొత్తంగా చేతికి అందుతుందని ఈపీఎఫ్వో తెలిపింది. జీవితంలో ఎదురయ్యే అస్థిర పరిస్థితులకు సామాజిక భద్రతగా పీఎఫ్ చెల్లింపు నిలుస్తుందని పేర్కొన్నది. ఈ సందర్భంగా అర్హులైన ఉద్యోగులను ఈపీఎఫ్వో పరిధిలోకి తీసుకురావడంలో యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.