న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: నిరుపయోగంగా మారిన ఈపీఎఫ్‌వో పాత ఖాతాల్ని యాక్టివేట్ చేసేందుకు, యూఏఎన్ నంబర్‌తో అనుసంధానం చేయడానికి ఈపీఎఫ్‌వో నుంచి సరికొత్త పోర్టల్ ‘ఈ-ప్రాప్తి’ అందుబాటులోకి రాబోతున్నది. ఈ డిజిటల్ వేదిక ద్వారా ఖాతాదార్లు తమ పాత ఖాతాల గుర్తింపు, క్లెయిమ్ ట్రాకింగ్, యూఏఎన్‌తో అనుసంధానం సహా వివిధ రకాల సేవలను సులభంగా పొందేందుకు ఆస్కారముంటుందని ఈపీఎఫ్‌వో అధికారులు వెల్లడించారు.
నిరుపయోగంగా మారిన పాత ఖాతాల్ని యాక్టివేట్ చేయడానికి ఒక ఆధార్ ఆధారిత పోర్టల్‌ను ప్రారంభించడానికి ఈపీఎఫ్‌వో సిద్ధంగా ఉన్నట్టు సంబంధిత వర్గాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపాయి. ఈపీఎఫ్‌వో పాత సభ్యత్వ ఐడీలను గుర్తుచేసుకోలేని, వాటిని పొందలేని సభ్యులను చేర్చేలా ‘ఈ-ప్రాప్తి’ పోర్టల్ పరిధిని విస్తరించినట్టు తెలిపారు.