న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్), ఉద్యోగుల పింఛన్ పథకం(ఈపీఎస్)లో ఉద్యోగులను తప్పనిసరిగా చేర్చేందుకు నెల వేతన గరిష్ఠ పరిమితిని రూ.15,000 నుంచి రూ. 25,000కు త్వరలో పెంచాలని ఈపీఎఫ్ఓ ఆలోచిస్తోంది. ప్రస్తుతం వేతన గరిష్ఠ పరిమితి నెలకు రూ.15,000 ఉంది. ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో ఉన్న ఈపీఎఫ్, ఈపీఎస్‌లో ఉద్యోగులు తప్పనిసరిగా చేరేందుకు ప్రస్తుతం ఈ వేతన సీలింగ్ అమలులో ఉంది.
మూల వేతనం రూ.15,000కు మించి ఉన్న ఉద్యోగులు ఈ రెండు ఈపీఎఫ్ఓ పథకాలలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే వీలుంది. అటువంటి ఉద్యోగులను తప్పనిసరిగా ఈపీఎఫ్, ఈపీఎస్‌లో నమోదుచేసే చట్టపరమైన అధికారం యాజమాన్యాలకు లేవు. నెల వేతన సీలింగ్‌ని రూ. 15,000 నుంచి రూ. 25,000 పెంచే ప్రతిపాదనను డిసెంబర్-జనవరిలో జరిగే తదుపరి ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీల సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కేంద్ర కార్మిక శాఖ అంతర్గత అంచనా ప్రకారం వేజ్ సీలింగ్ పరిమితిని రూ. 10,000 పెంచడం వల్ల మరో కోటి మంది ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలు తప్పనిసరిగా అందుబాటులోకి వస్తాయని ఓ అధికారి తెలిపారు. మెట్రో నగరాలలో కింది స్థాయి లేదా మధ్య స్థాయి ఉద్యోగుల నెల జీతం రూ. 15,000 కన్నా ఎక్కువగానే ఉన్న కారణంగా వేతన సీలింగ్‌ని పెంచాలని కార్మిక సంఘాలు చాలా సంవత్సరాలుగా కోరుతున్నట్లు ఆ అధికారి చెప్పారు. సీలింగ్‌ని పెంచడం వల్ల చాలామంది ఉద్యోగులు ఈపీఎఫ్ఓలో భాగస్వాములవుతారని వివరించారు.