న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ చట్టాలకు కోరలు పీకేసి నిర్వీర్యం చేశారంటూ కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. పంట వ్యర్థాలను తగలబెడితే జరిమానా విధించే ‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జర్నింగ్ ఏరియాస్ యాక్ట్ ( సీఏక్యూఎం)’ను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు అవసరమైన యంత్రాంగాన్ని రూపొందించకుండానే ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కోసం కమిషన్ను రూపొందించారంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. పొరుగు రాష్ర్టాలు పంజాబ్, హర్యానా రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడం ద్వారా వాయు కాలుష్యంతో ఢిల్లీ సతమతం అవుతున్నది. ప్రతి ఏడాది ఇదే సమస్య ఎదురవుతున్నప్పటికీ సీఏక్యూఎం అమలుకు పంజాబ్, హర్యానా రాష్ర్టాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.