Moradabad Firing | ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. ఓ ఇంట్లో మాఫియా నేత దాక్కున్న సమాచారం అందుకుని దాడులకు వెళ్లిన పోలీసులను బంధీలుగా పట్టుకుని ఆయుధాలు దోచుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్న స్థానిక బీజేపీ నేత భార్య చనిపోయింది.
మొరాదాబాద్‌లోని ఠాకూర్ద్వారా ప్రాంతంలో మైనింగ్ మాఫియా జాఫర్ ఉన్నట్లు యూపీ పోలీసులకు బుధవారం మధ్యాహ్నం కచ్చితమైన సమాచారం అందింది. దాంతో సాయంత్రం ఐదున్నర గంటలపాటు పోలీసులు తనిఖీలు చేపట్టగా.. జాఫర్ కాల్పులు ప్రారంభించాడు. లొంగిపోవాలని హెచ్చరిస్తూ పోలీసులు కూడా కాల్పులు జరిపారు. తనను పోలీసులు చుట్టముట్టింది గుర్తించిన జాఫర్.. అక్కడి నుంచి యూపీ సరిహద్దు దాటి ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా పరిధిలోని భరత్పూర్ గ్రామానికి వచ్చాడు. అక్కడ బీజేపీ నేత గుర్తజ్ భుల్లార్ సింగ్ ఫామ్‌హౌస్‌లో తలదాచుకున్నాడు.
మఫ్టీలో వచ్చిన యూపీ పోలీసులను భరత్పూర్ గ్రామస్థులు అడ్డుకున్నారు. వారితో వాదనకు దిగారు. లోకల్ పోలీస్‌ను పిలవాలని బీజేపీ నేత గుర్తాజ్ భుల్లార్ సింగ్ కుటుంబీకులు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఫాంహౌస్ నుంచి పారిపోయేందుకు జాఫర్ ప్రయత్నించాడు. జాఫర్‌ను నిలువరించే ప్రయత్నంలో నడిరోడ్డుపై ఇరువైపుల నుంచి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న గుర్తాజ్ సింగ్ భార్య గుర్మీత్ కౌర్ (28) గాయపడి చనిపోయారు. ఈ దశలో ఫార్మ్ హౌస్‌లోకి చొచ్చుకుపోయిన 12 మంది పోలీసులను జాఫర్ ముఠా బంధీలుగా చేసుకుని వారి నుంచి ఆయుధాలు లాక్కొని పారిపోయారు. ఈ కాల్పుల్లో ఇన్స్పెక్టర్ సహా ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. ఉత్తరాఖండ్ సరిహద్దులోని ఐదు జిల్లాల్లో మైనింగ్ మాఫియా చెలరేగిపోతున్నా యూపీ యోగి ఆదిత్యనాథ్ పట్టనట్లుగా ఉండటం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.