న్యూఢిల్లీ: ప్రముఖ నవలా రచయిత్రి మన్నూ భండారి (90) కన్నుమూశారు. హర్యానా రాష్ట్రం గుర్గావ్లోని నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. హిందీ భాషలో ఎన్నో నవలలు రాసిన మన్నూ భండారి గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం క్రితం ఇన్ఫెక్షన్ సోకడంతో ఆమె కుమార్తె రచనా యాదవ్ నారాయణ హాస్పిటల్లో చేర్పించారు.
కాగా, మన్నూ భండారీ 1931లో మధ్యప్రదేశ్‌లోని భాన్పురలో జన్మించారు. హిందీ ఫిక్షన్ రైటర్ రాజేంద్ర యాదవ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. ఆమె రాసిన యహీ సచ్ హై నవల ఆధారంగా 1974లో రజినీగంధ అనే సినిమా చేశారు. 1975లో ఈ సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డుతోపాటు ఎన్నో అవార్డులు దక్కాయి. ఆప్కీ బంటీ, మహభోజ్ అనే నవలలు ఆమె రాసిన నవలల్లో ప్రముఖమైనవి.