న్యూఢిల్లీ: కర్బన ఉద్గారాలను (కార్బన్ డయాక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్స్) అరికడుతూ పర్యావరణం నుంచి స్వచ్ఛమైన ఇంధనాన్ని తయారుచేసే అవకాశాలు ఉన్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రకృతిలో లభించే చిన్న బ్యాక్టీరియాతో ఈ ఫలితాన్ని రాబట్టవచ్చని ఫ్రాంటియర్స్‌లో ప్రచురితమైన అధ్యయన నివేదిక పేర్కొంది. చెరువులు, కుంటలు, బావులలో లభించే ‘క్యాండిడేటస్ మిథేనోపెరెడిన్స్’ అనే బ్యాక్టీరియాతో పరిశోధనశాలలో విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని తెలిపింది. ఈ బ్యాక్టీరియా మీథేన్ పదార్థాన్ని తింటూ పెరుగుతుందని పేర్కొంది. భూగర్భజలాలు, ఉపరితల జలాలు నైట్రోజన్‌తో కలుషితమైన ప్రదేశాల్లో ఈ బ్యాక్టీరియా లభిస్తుందని తెలిపింది. మీథేన్‌ను విచ్ఛిన్నం చేయడానికి నైట్రేట్ అవసరమని వివరించింది. ‘బ్యాక్టీరియాలోని సూక్ష్మజీవుల్లో జరిగే మార్పుల ప్రక్రియ గురించి తెలుసుకోవాలని పరిశోధకులు ప్రయత్నించారు. బయోగ్యాస్ ఉత్పత్తి విధానంలో విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చా అన్నది కూడా తెలుసుకోవాలనుకున్నారు. అదృష్టవశాత్తు వారు ఆ మార్గాన్ని కనుగొన్నారు’ అని నివేదిక వివరించింది.