ముంబై, జనవరి 3: మహారాష్ట్రలో విద్యుత్తు ఉద్యోగులు సమ్మె సైరన్ పూరించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మూడు ప్రభుత్వ విద్యుత్తు సంస్థల ఉద్యోగులు బుధవారం నుంచి 72 గంటలు నిరవధిక సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో శివసేన పార్టీని చీల్చి అధికారంలోకి వచ్చాక బీజేపీ, విద్యుత్తు కంపెనీలను ప్రైవేటుపరం చేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నది. కేంద్రంలోని మోదీ సర్కారు లక్ష్యాలకు అనుగుణంగా, ప్రధాని సన్నిహిత మిత్రుడైన అదానీ కంపెనీకి రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు సరఫరా లైసెన్సులు ఇచ్చే కార్యక్రమానికి తెరలేపింది. దీంతో ప్రభుత్వ విద్యుత్తు సంస్థల మనుగడ ప్రశ్నార్థకమైంది.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజ్య కర్మచారీ, అధికారి, అభియంత్ర సంఘర్ష్ సమితి భారీ సమ్మెకు పూనుకొన్నది. ప్రభుత్వరంగ విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించాలన్న బీజేపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా డ్రైవర్లు, వైర్‌మెన్, ఇంజినీర్లు తదితర 30కిపైగా సంఘాలు ఒక్కటై సమ్మెకు పూనుకొన్నాయి అని మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ ఫెడరేషన్ కార్యదర్శి కృషన్ భోయిర్ మంగళవారం తెలిపారు. ది మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (మహావితరన్), మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ (మహాపరేషన్), మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ (మహానిర్మితి) కంపెనీలు మహారాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నాయి. వీటిల్లో 86 వేల మంది ఉద్యోగులు, అధికారులు, ఇంజినీర్లతోపాటు 42 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు.
అదానీ కంపెనీతో చిచ్చు
మహారాష్ట్ర విద్యుత్తు ఉద్యోగులు భారీ ఎత్తున సమ్మెకు దిగటానికి అదానీ పవర్ కంపెనీయే కారణమని తెలుస్తున్నది. అదానీ పవర్‌కు అనుబంధ సంస్థ అయిన అదానీ ఎలక్ట్రిసిటీ నవీ ముంబై లిమిటెడ్ కంపెనీకి ఇప్పటికే ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా చేసేందుకు లైసెన్సు ఉన్నది. గత ఏడాది నవంబర్‌లో ఈ సంస్థ భండప్, ములంద్, థాణె, నవీ ముంబై, పన్వెల్, తలోజ, ఉరన్ ప్రాంతాల్లో కూడా విద్యుత్తు వ్యాపారం చేసుకొనేందుకు లైసెన్సు కోసం మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఎంఈఆర్సీ)కి దరఖాస్తు చేసింది. లైసెన్స్ జారీ చేస్తే ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ నెట్‌వర్క్‌ను వాడుకొని ఈ కంపెనీ విద్యుత్తు వ్యాపారం చేసుకొంటుంది.
ప్రస్తుతం విద్యుత్తు సరఫరా చేస్తున్న మహావితరన్ కంపెనీ ఆ ప్రాంతాలను వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో అదానీ కంపెనీకి కొత్త లైసెన్స్‌లు ఇవ్వరాదన్న ప్రధాన డిమాండ్‌తోనే ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. వీరి డిమాండ్లలో జీతాల పెంపు వంటి అంశాలు లేకపోవటం విశేషం. తాము ప్రభుత్వ సంస్థలను కాపాడటానికి మాత్రమే సమ్మెకు దిగామని భోయిర్ తెలిపారు. అదానీ కంపెనీకి లైసెన్సులు ఇవ్వరాదని విద్యుత్తు ఉద్యోగులు గత మూడు వారాలుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. సోమవారం థాణె కలెక్టర్ కార్యాలయం ముందు 15,000 మంది ధర్నా నిర్వహించారు. అయినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో సమ్మెకు దిగారు.