న్యూఢిల్లీ, అక్టోబర్ 18: రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ కమిషన్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పని చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యుత్తు చట్టం 2003లోని సెక్షన్ 108 ప్రకారం విధానపరమైన ఆదేశాలు ఇచ్చి కమిషన్లను ప్రభుత్వాలు ప్రభావితం చేయలేవని పేర్కొన్నది. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తు నియంత్రణ కమిషన్లకు కేవలం సూచనలు మాత్రమే చేయగలవని కోర్టు తెలిపింది. ఏడు విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల(పీఎస్ఏ)ల కోసం కేరళ ప్రభుత్వం కేరళ రాష్ట్ర విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్(కేఎస్ఈఆర్సీ) ఆమోదాన్ని కోరింది. అయితే, నాలుగు పీఎస్ఏల విషయంలో కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు(కేఎస్ఈబీ) సరైన మార్గదర్శకాలను పాటించలేదని కేఎస్ఈఆర్సీ తిరస్కరించింది. దీంతో నాలుగు పీఎస్ఏలకు ఆమోదం తెలపాలని సెక్షన్ 108 కింద కేరళ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో కేఎస్ఈఆర్సీ ఆమోదం తెలిపింది. దీనిపై ఇద్దరు విద్యుత్తు ఉత్పత్తిదారులు ఏపీటీఈఎల్లో అప్పీల్ చేశారు. దీంతో కేఎస్ఈఆర్సీ ఉత్తర్వును ఏపీటీఈఎల్ రద్దు చేసింది. దీనిని సవాల్ చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీటీఈఎల్ తీర్పుతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. సెక్షన్ 108 కింద రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు నియంత్రణ కమిషన్లను నియంత్రించలేవని స్పష్టం చేసింది.