న్యూఢిల్లీ: ఏప్రిల్ నెలలో ఖాళీ కానున్న 13 రాజ్యసభ స్థానాల భర్తీకి మార్చి 31న ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) సోమవారం ప్రకటించింది. మార్చి 14న నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు మార్చి 21. మార్చి 22న నామినేషన్ల పరిశీలన, మార్చి 24లోగా అభ్యర్థుల విత్ డ్రాకు అవకాశం. మార్చి 31న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అనంతరం అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఏప్రిల్ 2కు ముందుగా 13 రాజ్యసభ స్థానాల భర్తీకి ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
కాగా, 13 రాజ్యసభ స్థానాల్లో పంజాబ్ నుంచి ఐదు, కేరళ నుంచి మూడు, అస్సాం నుంచి రెండు, హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర నుంచి ఒక్కొక్కటి చొప్పున భర్తీ చేయనున్నారు. రాజ్యసభ సభ్యులు సుఖ్‌దేవ్ సింగ్, ప్రతాప్ సింగ్ బజ్వా, శ్వైత్ మాలిక్, నరేష్ గుజ్రాల్, షంషేర్ సింగ్ దుల్లో, ఏకే ఆంటోనీ, ఎంవీ శ్రేయామ్స్ కుమార్, కే సోమప్రసాద్, రాణీ నారా, రిపున్ బోరా, ఆనంద్ శర్మ, కేజీ కెన్యా, జర్నా దాస్ పదవీ కాలం ఏప్రిల్‌లో ముగుస్తుంది. రాష్ట్ర శాసనసభ్యుల దామాషా ప్రాతినిధ్య ఓట్ల ఆధారంగా రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు.