SIR | బిహార్లో చేపట్టిన ఓటర్ లిస్ట్ ప్రత్యేక సవరణ (SIR) విషయంలో తీవ్రమైన నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఓటర్ల జాబితా నుంచి ఓటర్లను తొలగించారన్న ఆరోపణలను తిరస్కరిస్తూ.. అర్హత ఉన్న ఏ ఓటరు పేరును జాబితా నుంచి తొలగించబోమని పేర్కొంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ క్యాంపెయిన్(SIR)పై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితా నుంచి 65లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఆరోపణలు రాగా.. సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని సమాధానం చెప్పాలని ఆదేశించింది.
ఆగస్టు ఒకటిన ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా నుంచి ఎవరైనా ఓటరు పేరును తొలగించే ప్రక్రియ నిబంధనల ప్రకారం జరుగుతుందని కమిషన్ అఫిడవిట్లో పేర్కొంది. పేరును తొలగించే ప్రతిపాదన, అందుకు సంబంధించి కారణాలను ఓటరుకు ముందే తెలియజేస్తారన్నారు. ప్రతి ఓటర్కు వాదనలు వినిపించేందుకు అవకాశం, సంబంధిత పత్రాలు అందించేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మొదటి దశ పూర్తయిందని కమిషన్ చెప్పుకొచ్చింది. తొలిదశలో దాదాపు 7.24కోట్ల మంది ఓటర్లు తమ సంబంధించి పత్రాలను సమర్పించారని.. వీటన్నింటిని సవర్తించిన జాబితాలో చేర్చనున్నట్లు తెలిపింది.
ఆయా పేర్లన్నింటిని డిజిటలైజ్ చేశారని, తొలగించబడిన ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలకు అందజేయనున్నట్లు తెలిపింది. తొలి దశను విజయవంతం చేసిన ఘనత బిహార్ ప్రధాన ఎన్నికల అధికారితో పాటు 38 జిల్లాల ఎన్నికల అధికారులు, 243 మంది ఈఆర్వోలు, 2976 మంది ఏఈఆర్వోలు, 77,895 మంది బీఎల్వోలు, వలంటీర్లు, 12 రాజకీయ పార్టీల అధ్యక్షులు, వారు నామినేట్ చేసిన 1.6లక్షల బీఎల్ఏలకు దక్కుతుందని చెప్పింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు ఎవరైనా ఓటరు జాబితాలో సవరణల కోసం ఫిర్యాదులతో పాటు అభ్యంతరాలు చెప్పవచ్చని పేర్కొంది.
సర్ ప్రక్రియను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగిస్తే వెంటనే జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీలను చెల్లుబాటయ్యే పత్రాలుగా పరిగణించాలని.. పేర్లను తొలగించే బదులు చేర్చే ప్రక్రియపై దృష్టి పెట్టాలని సూచించింది. ఆగస్టు 6న, బీహార్ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన సుమారు 65 లక్షల మంది ఓటర్ల పూర్తి సమాచారాన్ని ఆగస్టు 9 నాటికి సమర్పించాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) అనే ఎన్జీవోతో పాటు పలు రాజకీయ పార్టీలకు సైతం అందించాలని సూచించింది.