Arun Goyal | మాల్దీవుల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు భారత్, చైనాలకు కీలకంగా మారాయి. అయితే, మాల్దీవుల ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల బృందం అక్కడికి వెళ్లింది. అధికారుల బృందం అక్కడ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది. ఇతర దేశాల నుంచి అంతర్జాతీయ పరిశీలకులు, సంస్థలకు చెందిన ప్రతినిధులు సైతం ఎన్నికల పరిశీలన కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొంది. మాల్దీవుల్లో అధ్యక్ష పదవికి తొలి దశ ఓటింగ్ శనివారం పూర్తయ్యింది.
ఇందులో ఎవరికీ మెజారిటీ రాకపోతే మరోసారి ఓటింగ్‌ను 30న నిర్వహించి, మొదటి ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరు అధ్యక్షుడిగా ఎంపికవనున్నారు. అయితే, ప్రెసిడెంట్ ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ భారత్‌కు అనుకూలంగా ఉంటుండగా.. వరుసగా ఆయన రెండోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష అభ్యర్థి మహ్మద్ ముయిజ్ పార్టీ ‘పుల్స్ నేషనల్ కాంగ్రెస్’ చైనాకు అనుకూలంగా ఉంటూ వస్తుంది. ఈ క్రమంలో ఎన్నికలు భారత్‌తో పాటు చైనాకు కీలకంగా మారాయి. అధ్యక్షుడిగా ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ గెలిస్తే చైనాకు ఇబ్బందులు ఎదురుకానుండగా.. చైనాకు అనుకూలంగా వ్యవహరించే ముయిజ్ గెలిస్తే భారత్‌కు కష్టాలు పెరిగే అవకాశాలున్నాయి. అదే సమయంలో హిందు మహాసముద్రంలో భారత్ ఉనికిని ప్రభావితం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.