న్యూఢిల్లీ, జనవరి 8: క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులను అభ్యర్థులుగా ఎన్నికల్లో నిలబెట్టే పార్టీలు.. వారి వివరాలు, అభ్యర్థులుగా వారినే ఎంచుకోవడానికి కారణాలను తమ వెబ్సైట్లలో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఐదు రాష్ర్టాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలన్నీ తమ అభ్యర్థిని ఎంచుకొన్న 48 గంటల్లోగా.. అతనిపై ఉన్న కేసుల వివరాలను ఒక స్థానిక వార్తా పత్రికలో, జాతీయ పత్రికలో ప్రచురించాలని, పార్టీ అధికారికి సోషల్ మీడియా పేజీలో అప్లోడ్ చేయాలని, 72 గంటల్లోగా ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించాలని తెలిపింది. లేకపోతే కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.