ECI | హర్యానాలో ఓట్ల రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాలు తోసిపుచ్చాయి. ఓటర్ల జాబితాపై ఎలాంటి అప్పీల్స్ దాఖలు కాలేదంటూ ఈసీ అధికారులను ఉటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ కథనం తెలిపింది. ఫేక్ ఓటర్లను నివారించాలంటే కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్లు సవరణ సమయంలో ఎందుకు అభ్యంతరాలు లేవనెత్తలేదని ఈసీ వర్గాలు ప్రశ్నించాయి. ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు, అవకతవకలను గుర్తించడానికి రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను కూడా నియమిస్తాయని గుర్తు చేశారు.
గత హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని రాహుల్ గాంధీ బుధవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఎన్నికల కమిషన్, బిజెపి కుట్రపూరితంగా వ్యవహరించాయని.. హర్యానాలో 2.5 మిలియన్ల ఓట్లు చోరీకి గురయ్యాయని వ్యాఖ్యానించారు. అందులో 5.21లక్షల నకిలీ ఓటర్లు, 93,174 చెల్లని ఓటర్లు, 19.26 లక్షల బల్క్ ఓటర్లు ఉన్నారని రాహుల్ పేర్కొన్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ రెండింటిలోనూ బీజేపీతో సంబంధం ఉన్న వేలాది మంది ఓటు వేశారని ఆరోపించారు.