Rajyasabha Elections | న్యూఢిల్లీ/ హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. వచ్చే నెల 27న దేశవ్యాప్తంగా 15 రాష్ర్టాల్లో 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఈసీ సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల అవుతుందని, 27న పోలింగ్ నిర్వహణ, అదే రోజున సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నది. ప్రస్తుతం రాజ్యసభలోని 56 మంది ఎంపీల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్‌తో ముగియనున్నది.
తెలంగాణ నుంచి ముగ్గురు సభ్యులు రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు. వీరిలో భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. వీరి స్థానంలో ఎవరు ఎన్నికవుతారన్నది ఆసక్తికరంగా ఉన్నది. రాజ్యసభ ఎన్నికలకు ఎమ్మెల్యేలు ఓట్లు వేయాల్సి ఉంటుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు సాధించిన నేపథ్యంలో ఆ పార్టీకి కనీసం రెండు స్థానాలు వచ్చే అవకాశం ఉన్నది. సంఖ్యా బలం రీత్యా బీఆర్ఎస్ ఒక స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునే అవకాశం ఉన్నది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజ్యసభ అభ్యర్థులను ఇంకా నిర్ణయించలేదు. షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో మరో వారంలో ఇరుపార్టీలు అభ్యర్థులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. కాంగ్రెస్‌లో తెలంగాణ నుంచి జానారెడ్డి, వీ హన్మంతరావు, చిన్నారెడ్డి వంటి నేతలతోపాటు పలువురు ముఖ్యులు రాజ్యసభ స్థానం ఆశిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ -10 , మహారాష్ట్ర-6, బీహార్ -6 , మధ్యప్రదేశ్-5 , పశ్చిమబెంగాల్-5 , గుజరాత్-4 , కర్ణాటక-4 తెలంగాణ-3, ఏపీ-3, ఒడిశా-3, రాజస్థాన్-3, ఛత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్, ఉత్తరాఖండ్-1 చొప్పున.
