న్యూఢిల్లీ : ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఆదివారం ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. తాను చేసిన ఆరోపణపై రుజువులను చూపిస్తూ రాహుల్ వారం లోగా అఫిడవిట్ సమర్పించాలని, లేకపోతే ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరింది. ఒకవేళ ఆరోపణలకు రుజువులు లేకపోతే అవన్నీ అబద్ధాలని పేర్కొంది.
‘అఫిడవిట్ ఇవ్వాలి. లేదా దేశానికి క్షమాపణ చెప్పాలి. అందులో మూడో ఐచ్ఛికం లేదు. ఒక వేళ ఏడు రోజుల్లో కనుక అఫిడవిట్ చేరకపోతే, ఆయన చేసిన ఆరోపణలన్నీ ఆధార రహితాలే’ అని ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. డబుల్ ఓటింగ్, ఓట్ల చోరీ జరిగిందన్న ఆరోపణలు ఆధారం లేనివని ఆయన కొట్టివేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానపర్చడమేనని అన్నారు. విధి నిర్వహణలో ఎన్నికల సంఘం ఎలాంటి వివక్ష లేకుండా నిలబడిందని అన్నారు.