లక్నో: వృద్ధ కార్మికురాలికి రూ.4.88 కోట్ల మేర పన్ను నోటీసు వచ్చింది. చదువురాని ఆమె ఇది చూసి షాక్ అయ్యింది. ఏమి చేయాలో తెలియక లబోదిబోమంటున్నది. (Elderly labourer gets tax notice) ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జస్రానాలోని మురికివాడలో భర్తతో కలిసి నివసిస్తున్న సబ్రా దినసరి కూలీ. మార్చి 30న ఇన్కమ్ ట్యాక్స్ విభాగం నుంచి ఆమెకు నోటీస్ వచ్చింది. 2021-22 అసెస్మెంట్ సంవత్సరానికిగాను రూ.4,88,37,927 ఆదాయంపై రిటర్న్ దాఖలు చేయాలని అందులో ఉన్నది. ఆ ఆదాయంపై పన్ను ఎగవేసిన ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని పేర్కొన్నారు.
కాగా, చదువురాని సబ్రా వేలిముద్ర వేసి ఈ నోటీస్ తీసుకున్నది. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీస్ అందినట్లు తెలుసుకుని షాక్ అయ్యింది. ఏమి చేయాలో తెలియక లబోదిబోమంటున్నది. అయితే ఆధార్ నంబర్ ఫోర్జరీ వల్ల ఆ వృద్ధురాలికి ఈ నోటీస్ వచ్చి ఉంటుందని ఒక న్యాయవాది అనుమానం వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి ఆ వృద్ధురాలు చట్టపరమైన విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని తెలిపారు. నిర్ణీత గడువులోగా అభ్యంతరాలతో కూడిన సమాధానం పంపాల్సి ఉంటుందని అన్నారు.