లక్నో: వక్ఫ్ సవరణ బిల్లుకు (Waqf bill) ముస్లిం వృద్ధుడు మద్దతు తెలిపాడు. ఈ నేపథ్యంలో మసీదు బయట కొందరు వ్యక్తులు ఆయనను అడ్డుకున్నారు. తిట్టడంతోపాటు కొట్టారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మైనారిటీ కమిషన్ మాజీ చైర్మన్ అష్ఫాక్ సైఫీ బావ, బీజేపీ మద్దతుదారుడైన జాహిద్ సైఫీ, వక్ఫ్ సవరణ బిల్లును సమర్థించారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మాఫియా, వక్ఫ్ బోర్డు డబ్బులు తినే వారే ఈ బిల్లు వల్ల సమస్యలు ఎదుర్కొంటారని ఆరోపించారు. పేద ముస్లింలు తమ హక్కులు పొందుతారని అన్నారు.
కాగా, గురువారం అబూ బకర్ మసీదులో జాహిద్ సైఫీ నమాజ్ చేశారు. అనంతరం మసీదు నుంచి బయటకు రాగా కొందరు వ్యక్తులు ఆయనను అడ్డుకున్నారు. ‘నువ్వు ముస్లిం కాదు. హిందువుగా మారావు’ అని ఆరోపించారు. ఆయనను తిట్టడంతోపాటు కర్రలతో కొట్టి పారిపోయారు. చెవిపై దెబ్బతగలడంతో వినలేకపోతున్నట్లు ఆయన వాపోయాడు.
మరోవైపు గాయపడిన జాహిద్ సైఫీని స్థానికులు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆయనపై దాడి చేసిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన రిజ్వాన్, నౌషాద్, షోయబ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరి కొందరు వ్యక్తుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.