లక్నో: ప్రభుత్వ రికార్డుల్లో మరణించి ఉన్నట్లుగా చూసి ఒక వృద్ధుడు షాక్ అయ్యాడు. (Agra Elderly man) అప్పటి నుంచి పింఛను అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఫలితం లేకపోవడంతో ‘నేను బతికే ఉన్నా’ అని రాసి ఉన్న ఫ్లకార్డును మెడలో వేసుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాడు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆగ్రా జిల్లాలోని ఎత్మాద్పూర్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల దీనానాథ్ యాదవ్ గత రెండేళ్లుగా పింఛను పొందాడు. అయితే ఈ ఏడాది మార్చి నుంచి పింఛను రావడం లేదు. గ్రామ కార్యదర్శిని కలిసి అడగ్గా సరిగా సమాధానం చెప్పలేదు. ఆగ్రా చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ (సీడీవో) కార్యాలయానికి వెళ్లి ఆరా తీశాడు. తాను చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉండటం చూసి షాక్ అయ్యాడు.
కాగా, తాను బతికే ఉన్నానని నిరూపించుకునేందుకు గత ఎనిమిది నెలలుగా దీనానాథ్ యాదవ్ ప్రయత్నిస్తున్నాడు. స్థానిక, జిల్లా అధికారులను కలిసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకోవాలని నిర్ణయించాడు. ‘నేను బతికే ఉన్నా’ అన్న ఫ్లకార్డును మెడలో వేసుకుని ఆగ్రా రోడ్లపై నడిచాడు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించారు. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్, గ్రామ కార్యదర్శి నుంచి వివరాలు అడిగారు. దీనానాథ్ యాదవ్ సమస్యను పరిష్కరించాలని వారిని ఆదేశించారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో వందలాది మంది మరణించినట్లుగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయని సామాజిక కార్యకర్త విజయ్ ఉపాధ్యాయ్ ఆరోపించారు. పింఛన్లు, ప్రభుత్వ పథకాల కోసం తాము బతికే ఉన్నామని నిరూపించుకునేందుకు వారంతా పోరాడుతున్నారని తెలిపారు.