న్యూఢిల్లీ, మే 30: రుతు పవన కాలంలో ఎల్‌నినో భారతదేశాన్ని తాకనుందని, దీనివల్ల గత మూడేండ్లలో దేశంలో వర్షపాతం అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) డీజీఎం డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. రానున్న రుతుపవన కాలంలో భారత్‌లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తన రుతుపవన అంచనాను వెల్లడించిన కొన్ని గంటలకే మహాపాత్ర ఈ సమాచారాన్ని అందచేశారు. ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రం కాలానుగుణంగా వేడెక్కడం. ఇది ఆసియా అంతటా వాతావరణ సరళిని దెబ్బ తీస్తుంది. జూన్ నాటికి ఇది సంభవిచ్చని అంచనా. రానున్న నెలల్లో ఎన్‌నినో ఎలా బలపడుతుందో మహపాత్ర వివరించారు. జూన్‌లో బలహీన స్థితిలో ఆవిర్భవించే ఎల్‌నినో జూలై మధ్య, ఆగస్టు నాటికి ఓ మోస్తరు బలాన్ని పుంజుకుంటుందని ఆయన చెప్పారు. అయితే సెప్టెంబర్‌లో పూర్తి బలాన్ని పుంజుకుని భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా విస్తృత ప్రభావాన్ని కలుగచేస్తుందని ఆయన తెలిపారు. భారత్‌కు సంబంధించి ఈ పరిణామాలు ప్రత్యేకంగా ముఖ్యమైనవి. చారిత్రాత్మకంగా ఎల్ నినో బలహీనమైన రుతు పవన వర్షపాతం, తరచుగా సంభవించే వడ గాలులు, వ్యవసాయం, నీటి వనరులపై పెరిగిన ఒత్తిడితో ముడిపడి ఉంది. అనేక ప్రపంచ వాతావరణ అంచనా కేంద్రాలు ఇప్పుడు ఎల్ నినో రాకను సూచిస్తుండడంతో దేశంలో రానున్న రుతు పవన కాలంపై ఇది చూపే ప్రభావంపై ఆందోళనలు పెరుగుతున్నాయి.