ముంబై : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు శుక్రవారం విమానం పైలట్ రూపంలో ఇబ్బంది ఎదురైంది. అయితే ఇది కాస్త అత్యవసరంగా మూత్రపిండాల చికిత్స చేయించుకోవాల్సిన మహిళకు వరంగా మారింది! శుక్రవారం జలగావ్లో ప్రభుత్వ కార్యక్రమం ముగించుకొని, విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, షిండే వ్యక్తిగత విమానం పైలట్ విమానాన్ని నడిపేందుకు తిరస్కరించారు. తన విధి నిర్వహణ సమయం ముగిసిందని, విమానాన్ని నడపాలంటే మరోసారి అనుమతి పొందాల్సి ఉంటుందని చెప్పారు.డాక్టర్ అనుమతి, ఎయిర్‌లైన్స్ అనుమతులు వచ్చిన తర్వాత ఎట్టకేలకు పైలట్ విమానాన్ని నడిపేందుకు అంగీకరించారు. ఇదంతా 45 నిమిషాలపాటు జరిగింది. అదే సమయంలో శీతల్ పాటిల్ అనే మహిళ అత్యవసరంగా మూత్రపిండాల చికిత్స కోసం ముంబైకి విమానంలో వెళ్లాల్సి ఉంది. కానీ వారు జలగావ్ విమానాశ్రయానికి చేరుకునేసరికి ఆ విమానం వెళ్లిపోయింది. మంత్రి గిరీశ్ మహాజన్‌కు ఈ విషయం తెలిసింది. షిండే అనుమతించడంతో ఆయన వెళ్లే విమానంలో శీతల్, ఆమె భర్త ముంబైకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు.