Eknath Shinde | మహారాష్ట్ర సీఎం పదవిపై రాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్ నాథ్ షిండే పెదవి విప్పారు. అధికార మహాయుతి కూటమిలోని మూడు మిత్ర పక్షాల మధ్య సమన్వయ లోపం లేదని కొట్టి పారేశారు. ప్రభుత్వంలో అధికార పంపిణీపై తన పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆదివారం తెలిపారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత ఆరోగ్య కారణాల పేరుతో ఏక్ నాథ్ షిండే తన సొంతూరికి వెళ్లారు. ఆదివారం ఠాణేకు బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ ఏక్ నాథ్ షిండే తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు.
గత రెండున్నరేండ్లుగా సీఎం గానూ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విశ్రాంతి లేకుండా పని చేయడం వల్ల ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకున్నానని ఏక్ నాథ్ షిండే చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తన వైపు నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవని బీజేపీ అగ్ర నాయకత్వానికి హామీ ఇచ్చానని ఏక్ నాథ్ షిండే తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో శివసేన నుంచి పూర్తి మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో హోంమంత్రి ఎవరికి ఇస్తారన్న విషయమై తదుపరి భేటీలో ఖరారవుతుందన్నారు. మరోమారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. తమకు మెజారిటీ కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఉంటామని, ప్రతిపక్షానికి కాదన్నారు.