అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న ఓ ఆలయంలో చోరీ జరిగింది. దాదాపు వంద ఏళ్ల క్రితం నాటి ఆలయంలో ఉన్న 8 విగ్రహాలను ఎత్తుకువెళ్లారు. విగ్రహాలు ఆలయంలో కనిపించడంలేదని బుధవారం గుర్తించారు. దీంతో హైదర్ఘర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముందుగా 9 విగ్రహాలను ఎత్తుకువెళ్లినట్లు ఫిర్యాదు చేశారని, కానీ ఒక విగ్రహం లభ్యమైందని అయోధ్య ఎస్పీ శైలేష్ కుమార్ పాండే తెలిపారు. చోరీ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఆనంద్ కుమార్ సింగ్ అనే వ్యక్తికి చెందిన ప్రైవేటు ప్రాపర్టీలో ఆలయాన్ని నిర్మించారు. ఆనంద్ కుమార్ రాజవంశానికి చెందినట్లు చెబుతున్నారు. రామ్ జానకీ ట్రస్టు ఈ ఆలయ నిర్వహణ చేస్తున్నది. ఆనంద్ కుమార్ సింగ్కు చెందిన పూర్వీకులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయంలో చాలా విగ్రహాలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఆలయ గర్భగుడికి చెందిన తాళాలు పగులగొట్టి ఉన్నట్లు పూజారి గుర్తించారు. లోహాలతో చేసిన ఆ విగ్రహాలు ఒక్కొక్కటి మూడు నుంచి తొమ్మిది ఇంచుల వరకు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఆలయం వద్ద సీసీ కెమెరాలు కానీ, సెక్యూర్టీ గార్డులు కానీ లేరు.