తిరువణ్ణామలై, జూన్ 4 : తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై (అరుణాచలం)లో దారుణాలు చోటుచేసుకున్నాయి. గిరి ప్రదక్షిణకు వచ్చిన ఇద్దరు యువతులపై ఒక ముఠా సామూహిక అత్యాచారానికి పాల్పడింది. ఈ దారుణానికి పాల్పడిన ముఠాలోని 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఒకరు మైనర్ కూడా ఉన్నాడు. వేర్వేరుగా జరిగిన ఈ ఘటనల వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని ధర్మపురికి చెందిన ఒక వివాహిత గత నెల 30న తన స్నేహితులతో కలిసి గిరి ప్రదక్షిణకు వచ్చింది. ప్రదక్షిణ పూర్తయిన తర్వాత వీరితో వచ్చిన వారు ముందు వెళ్లగా, పెద్ద కోలాపాడి వద్ద ఆమె, మరో స్నేహితుడు వాహనం ఆపి మాట్లాడుకుంటుండగా, మారణాయుధాలతో వచ్చిన ఒక ముఠా వారిని బెదిరించింది. తర్వాత వారిని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లింది. వివాహితపై ఆ దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
తర్వాత వారిని నగ్నంగా చేసి వీడియో తీశారు. మరునాడు ఆ వివాహితకు ఆ వీడియోను పంపి లక్ష రూపాయలు ఇవ్వాలంటూ బెదిరించారు. దీంతో ఆమె రూ.4 వేలు చెల్లించింది. తర్వాత ధర్మపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరువణ్నామలై పడమర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తిరువణ్ణమలైలో ఇలాంటి ఘటనే మరునాడు సంభవించింది. మే 31వ తేదీన తిరువణ్ణామలై మున్సిపాల్టీ పరిధికి చెందిని 23 ఏండ్ల యువతి గిరి ప్రదక్షిణకు వచ్చింది. గిరిప్రదక్షిణ చేస్తుండగా కాళ్లు నొప్పులు పుట్టడంతో అడిఅన్నామలై అనే గ్రామం వద్ద కూర్చుని తన స్నేహితుడిని పిలిచింది. తర్వాత ఇద్దరూ కలిసి సమీపంలోని హోటల్లో టిఫిన్ పార్సిల్ కట్టించుకుని అయ్యంపాలయం బైపాస్ రోడ్ వద్దకు వెళ్లగా, అక్కడ ఒక ముఠా వారిని బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లింది. అక్కడ ఇద్దరినీ చిత్రహింసలు పెట్టారు.
తర్వాత ఆ యువతిపై సామూహిక లైంగిక దాడి చేసి, ఇద్దరినీ నగ్నంగా వీడియో తీసి, యువతి దగ్గర ఉన్న బంగారు కమ్మలు లాక్కుని విడిచిపెట్టారు. ఈ ఘటనపై పడమర పోలీసులకు ఫిర్యాదు రావడంతో వారు ఐదు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. మొత్తం 11 మంది నిందితులు ఈ ఘాతుకాలకు పాల్పడినట్టు గుర్తించారు. అందులో ఎనిమిది మందిని మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. వారిలో 16 ఏండ్ల బాలుడు కూడా ఉన్నాడు. కాగా, ఈ దారుణాల గురించి తెలిసి భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. చాలామంది భక్తులు తెల్లవారుజామునే గిరిప్రదక్షిణకు ఉపక్రమిస్తారు. అందులో వందలాది మంది మహిళా భక్తులు కూడా ఉంటారు. గిరిప్రదక్షిణ దారిలో గట్టి గస్తీ ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, తిరువణ్ణామలైలో గత ఏడాది సెప్టెంబర్లో ఏపీకి చెందిన యువతిపై ఇద్దరు పోలీసులు లైంగికదాడికి పాల్పడ్డారు.