కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై (Abhishek Banerjee) దాడి జరిగింది. ఎన్నికల అనంతర హింసాకాండ బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన ఆయనపై కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. ‘దొంగ దొంగ’ అంటూ స్థానిక బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. శనివారం సోనార్పూర్ ప్రాంతాన్ని అభిషేక్ బెనర్జీ సందర్శించారు. ఎన్నికల అనంతర హింసాకాండ బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు అక్కడకు చేరుకున్నారు.
కాగా, స్థానికులైన బీజేపీ కార్యకర్తలు అభిషేక్ బెనర్జీని అడ్డుకున్నారు. ఆయనపై కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. ‘దొంగ దొంగ’ అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అభిషేక్ బెనర్జీ హెల్మెట్ ధరించగా, సెక్యూరిటీ సిబ్బంది ఆయనకు రక్షణగా నిలిచారు.
మరోవైపు తనపై జరిగిన దాడికి బీజేపీనే కారణమని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ‘ఇదంతా బీజేపీ ప్రాయోజితం. వాళ్లు ఏం చేశారో చూడండి. వాళ్ల ప్రజాస్వామ్యానికి ఉదాహరణ ఇదేనా. నెల కూడా కాలేదు. పోలీసులు ఎక్కడా కనిపించడం లేదు’ అని విమర్శించారు.
తన పర్యటన గురించి ముందస్తు సమాచారం అందించినప్పటికీ, తగినంత భద్రత కల్పించలేదని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ‘పోలీసులు, భద్రతా బలగాలు ఇక్కడ భద్రత కల్పించేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలబోను. వారు ఈ ఇంటిని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాక నన్ను చంపాలని చూస్తున్నారు’ అని ఆయన అన్నారు.