న్యూఢిల్లీ,: డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్(డీపీడీపీ) నిబంధనలు, 2025కు సంబంధించి కేంద్రం ఇటీవల జారీచేసిన నోటిఫికేషన్‌పై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈడీఐ),డిజీపబ్ (డిజిటల్ మీడియా సంస్థ ప్రతినిధుల సంఘం) తీవ్ర అభ్యంతరం తెలియచేశాయి. ఈ కొత్త నిబంధనలు వార్తాసేకరణను అడ్డుకుంటాయని, సమాచార హక్కు చట్టాన్ని(ఆర్టీఐ) బలహీనపరుస్తాయని, జర్నలిస్టులపై అంతులేని భారాన్ని మోపుతాయని ఈ రెండు సంఘాలు వేర్వేరు ప్రకటనల్లో ఆగ్రహం వ్యక్తం చేశాయి. జర్నలిస్టులు, మీడియా సంస్థలకు ఈ నిబంధనలు సమాధానం దొరకని అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో ఈజీఐ పేర్కొంది.
జర్నలిస్టు విధులు డీపీడీపీ చట్టంలోకి రావని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ మీడియా సంస్థలకు హామీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత అధికారికంగా ఎటువంటి స్పందన లేదని గిల్డ్ పేర్కొంది. స్పష్టమైన మినహాయింపులు, నిర్దిష్టమైన మార్గదర్శనం రానంత వరకు జర్నలిస్టుల కార్యకలాపాలలో సందిగ్ధత కొనసాగుతూనే ఉంటుందని గిల్డ్ తెలిపింది. కొత్త నిబంధనలతో జవాబుదారీతనంతో కూడిన జర్నలిజానికి అవరోధం ఏర్పడే ముప్పు ఉందని రెండు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రాజ్యాంగపరంగా కల్పించిన వాక్ స్వాతంత్య్ర హక్కు, ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కును వాటితో సమతుల్యం చేయాల్సి ఉంటుందని గిల్డ్ సూచించింది.