న్యూఢిల్లీ, మే 25 : ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ నార్వే, నెదర్లాండ్స్ పర్యటనల సందర్భంగా విదేశీ పాత్రికేయులు, భారత అధికారుల మధ్య జరిగిన వాగ్వాదాలను ‘అభ్యంతరకరమైనవి’గా భారత ఎడిటర్స్ గిల్డ్ (ఈజీఐ) అభివర్ణించింది. మీడియాను శత్రువుగా చూడటం మానుకోవాలని ఈజీఐ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2014లో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రధాని మోదీ ఒక్కసారి కూడా బహిరంగంగా విలేకరుల సమావేశం నిర్వహించకపోవడం ‘విచారకరమైన వాస్తవం’ అని పేర్కొన్నది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా నెదర్లాండ్స్, నార్వేకు చెందిన పాత్రికేయులు, భారత ప్రభుత్వ అధికారుల మధ్య ఇబ్బందికరమైన ప్రతిష్ఠంభన నెలకొనడం ఆందోళనకరమని ఎడిటర్స్ గిల్డ్ ఒక ప్రకటనలో తెలిపింది.
స్థానిక జర్నలిస్టులతో సమావేశం అనంతరం వారు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు ప్రధాని మోదీ నిరాకరించడంతో యూరోపియన్ మీడియాతో ఈ ఘర్షణ మొదలైందని పేర్కొన్నది. నార్వే ప్రధాని జోనస్ గహర్ స్టోర్‌తో కలిసి ప్రధాని మోదీ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసిన అనంతరం స్థానిక జర్నలిస్టు హెల్లె లింగ్తోపాటు మరికొందరు విలేకరులు మోదీని ప్రశ్నలు అడిగేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రశ్నలకు మోదీ జవాబు చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. భారత్‌లో పత్రికా స్వేచ్ఛ, మైనారిటీల హక్కులకు సంబంధించి హెల్లె లింగ్ ప్రశ్నలు లేవనెత్తడంతో భారత దౌత్య అధికారులు, యూరోపియన్ పాత్రికేయుల మధ్య వివాదం మొదలైంది. దీనికి భారత విదేశాంగశాఖ కార్యదర్శి సిబీ జార్జ్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.