రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేశ్ బగేల్ తనయుడు చైతన్య బగేల్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు (ED Raids) చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారిన వ్యవహారంలో హస్తం ఉన్నట్లు చైతన్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భిలాయ్‌లోని ఆయన నివాసంతోపాటు రాష్ట్రంలోని 14 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పలువురు వ్యక్తుల ఇండ్లలో సోదాలు చేస్తున్నారు. ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్‌కు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.
మద్యం కుంభకోణం ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం పాటిళ్లిందని, మద్యం సిండికేట్‌కు రూ.21 వేల కోట్లకు పైగా లాభం చేకూరిందని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తున్నది. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగానే చైతన్య బగత్ నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. కాగా, బఘేల్ ఇంటి వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు.