న్యూఢిల్లీ, మే 18: ల్యాండ్ ఫర్ జాబ్ (ఉద్యోగాలకు భూములు) కేసులో బీహార్ మాజీ సీఎం రబ్రీదేవిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఏకబిగిన ఐదు గంటలపాటు విచారించింది. సెంట్రల్ ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఈనేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు ఈడీ తెలిపింది. ఈ కేసులో రబ్రీదేవి కుమారుడు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, కుమార్తెలు మిసా భారతి, చాందా యాదవ్, రాగినీ యాదవ్ తదితరులను గతకొన్నాళ్లుగా ఈడీ ప్రశ్నిస్తున్నది. ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణంలో రూ.600కోట్లు ముడుపులు అందాయని ఈడీ ఆరోపిస్తున్నది. 2004-09 మధ్య భూముల రూపంలో ముడుపులు తీసుకొని గ్రూప్-డీ రైల్వే ఉద్యోగ నియామాకాలు జరిపారని రబ్రీదేవి, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదుచేసింది.