పాతానంతిట్ట: కేరళలోని శబరిమల(Sabarimala) అయ్యప్ప స్వామి ఆలయానికి ప్రధాన పూజారిగా ఈడీ ప్రసాద్ ఎంపికయ్యారు. ఆయన స్వగ్రామం త్రిసూరు జిల్లాలోని చాలకుడి. సంప్రదాయ పద్ధతిలో డ్రా విధానంలో మేల్సంతిని ఎంపిక చేశారు. ఇవాళ ఉదయం 8 గంటలకు సన్నిధానంలో ప్రధాన పూజారి ఎంపిక ప్రక్రియ జరిగింది. ప్రస్తుతం ఆరేశ్వరం శ్రీ ధర్మ శాస్త ఆలయంలో ప్రసాద్ పూజారిగా చేస్తున్నారు. పాండలం రాచ కుటుంబానికి చెందిన కశ్యప వర్మ ఆధ్వర్యంలో శబరిమల మేల్‌సంతి డ్రా జరిగింది. శబరిమల మేల్‌సంతి ఎంపిక ప్రక్రియను పాండలం రాచ కుటుంబీకుల చిన్నారులతో చేపట్టాలని 2011లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం డ్రా నిర్వహించారు. కశ్యప్ ప్రస్తుతం అయిదో గ్రేడ్ చదువుతున్నాడు. నెదర్లాండ్స్‌లోని అల్మేర్లో ఆ పిల్లోడు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడు.
మల్లికాపురం ఆలయానికి మేల్‌సంతిగా ఎంజీ మను నంబూతిరి ఎంపికయ్యారు. పాండలం రాచ కుటుంబానికి చెందిన మైథిలీ అనే నాలుగో తరగతి చదువుతున్న చిన్నారి డ్రా తీశారు. శనివారం తెల్లవారుజామున 5 గంటలకు శబరిమల ఆలయాన్ని తెరిచారు. మలయాళ మాసం తులం తొలి రోజు ఇవ్వాళే. అక్టోబర్ 22వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. శబరిమల అయ్యప్పను దర్శించుకోనున్నారు. ఆమె రాక సందర్భంగా శబరిమలలో అక్టోబర్ 22వ తేదీన భక్తులకు ఆంక్షలు విధించనున్నారు.