బెంగళూరు, అక్టోబర్ 28: ముడా స్కామ్‌లో మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేతికి బలమైన సాక్ష్యం అందింది. ఈ స్కామ్‌లో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్న వీడియోను ముడా కుంభకోణంపై ఫిర్యాదుదారుల్లో ఒకరైన ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ ఈడీకి సోమవారం అందజేశారు. ఓ కారు వెనుక సీట్లో నోట్ల కట్టలు లెక్కిస్తున్నట్టుగా, రూ.25 లక్షలు చేతులు మారుతున్నట్టుగా ఈ వీడియో ఉందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఈడీ అదనపు డైరెక్టర్‌కు లేఖ రాశారు. ఈ వీడియోపై విచారణ జరపాలని, ఇందులో కనిపించిన వ్యక్తులకు సమన్లు జారీ చేయాలని ఆయన కోరారు.
సీఎం సన్నిహితుడి ఇంట్లో సోదాలు
ముడా స్కామ్‌లో కర్ణాటకలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. బెంగళూరు, మైసూరులోని ఏడెనిమిది ప్రాంతాల్లో సోమవారం సోదాలు జరిగాయి. మైసూరులోని సిద్ధరామయ్య సన్నిహితుడు రాకేశ్ పాపన్న ఇంట్లో ఈడీ సోదాలు చేసి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. అనంతరం ఆయనను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నది. బెంగళూరులోని ఓ బిల్డర్ ఇంటితో పాటు మాజీ ముడా కమిషనర్లు జీటీ దినేశ్ కుమార్, డీబీ నటేశ్ ఇండ్లపైనా ఈడీ దాడులు చేసింది. ముడా కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన భార్య పార్వతి తక్కువ విలువ కలిగిన భూమిని ముడాకు అప్పగించి, బదులుగా ఖరీదైన 14 స్థలాలను పొందారనే ఆరోపణలతో ఈ కేసు నమోదయ్యింది. ఈ స్కామ్ కర్ణాటకలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నది. ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య తప్పుకోవాలని ప్రతిపక్షాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.