న్యూఢిల్లీ, నవంబర్ 12: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లపై ఇక క్యూఆర్ కోడ్, పాస్కోడ్ వచ్చి చేరాయి. కొందరు వ్యక్తులు నకిలీ సమన్లతో డబ్బులు దండుకొంటున్న ఉదంతాలతో… ఆ బెడదను తప్పించడానికి టెక్నాలజీని వాడుకోవాలని ఈడీ నిర్ణయించింది. ఎవరికైనా సమన్లు అవి నిజమైనవేనా కాదా నిర్ధారించుకోవడానికి వీలుగా క్యూఆర్ కోడ్, పాస్కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సిస్టమ్ జనరేటెడ్’ సమన్లపై ఉండే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే ఈడీ వెబ్సైట్ పేజీ తెరుచుకుంటుంది. ఆ పేజీలో సమన్లో ఉండే పాస్కోడ్ ఎంటర్ చేయాలి. దాంతో ఆ సమన్ నిజమైనదా కాదా అనేది తెలుసుకోవచ్చని ఈడీ తెలిపింది.