బెంగుళూరు: కర్నాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే బీ నాగేంద్ర(B Nagendra)ను ఈడీ అధికారులు ఇవాళ అరెస్టు చేశారు. గడిచిన రెండు రోజుల నుంచి మాజీ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. మహర్షి వాల్మీకి ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన స్కామ్‌తో లింకున్న కేసులో నాగేంద్రను అరెస్టు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం కేంద్ర ఏజెన్సీ సుమారు 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. షెడ్యూల్ తెగల సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న సమయంలో నాగేంద్ర భారీ స్కామ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. జూన్ నెలలో ఆయన మంత్రిగా రాజీనామా చేశారు. కార్పొరేషన్‌కు చెందిన యూనియన్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న సుమారు 89.9 కోట్ల డబ్బును.. వివిధ గుర్తింపు లేని అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రెండు రోజుల నుంచి డాలర్స్ కాలనీలో ఉన్న ఇంటి నుంచి నాగేంద్రను బయటకు వెళ్లనివ్వలేదు ఈడీ అధికారులు. గురువారం రోజు ఆయన్ను ప్రశ్నించేందుకు ఈడీ ఆఫీసుకు తీసుకెళ్లారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బసనగౌడ దడ్డాల్ నివాసంలో కూడా సోదాలు జరిగాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన ముగ్గురు మాజీ ఉద్యోగుల ఇండ్లను కూడా అధికారులు తనిఖీ చేశారు.