లక్నో: బీఎస్పీ మాజీ ఎమ్మెల్సీ, గ్యాంగ్‌స్టర్ హాజీ ఇక్బాల్‌కు చెందిన గ్లోబల్ యూనివర్సిటీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. దీని విలువ రూ.4,440 కోట్లు ఉంటుంది. హాజీ 2007-12 మధ్య కాలంలో బీఎస్పీ ప్రభుత్వంలో ఎంతో పలుకుబడి, ఆధిపత్యం కలిగి ఉండేవారు. ఆయన యూపీలోని మీర్జాపూర్ ప్రాంతంలో 121 ఎకరాల్లో గ్లోబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. నదులను ఆక్రమించుకుని మరీ దాన్ని నిర్మించారు. ఆయనకు సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంలోనూ బాగా పలుకుబడి ఉండేది. ఆయన ఆక్రమాల గురించి అందరికీ తెలిసినప్పటికీ, గత ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు. 2017 నుంచి ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసులు నమోదవుతున్నాయి. పోలీసులు ఆయన తమ్ముడిని, నలుగురు కుమారులను అరెస్ట్ చేయగలిగారు. కానీ హాజీ ఇక్బాల్ ఆచూకీ మాత్రం ఇప్పటికీ దొరకడం లేదు.