న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia), ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో వ్యాపారవేత్త అమన్‌దీప్ సింగ్ ధాల్, రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రా తదితరుల ఆస్తులు ఉన్నాయి. మనీష్ సిసోడియా, ఆయన భార్య సీమాకు చెందిన రెండు ఆస్తులు, వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.11 లక్షలను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. సిసోడియా సన్నిహితుడైన ఢిల్లీ వ్యాపారవేత్త దినేష్ అరోరాను అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత ఈడీ ఈ చర్యలు చేపట్టింది. పలువురికి చెందిన రూ.52 కోట్ల ఆస్తులను అచాట్ చేసింది.
కాగా, ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గత ఏడాది సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతోపాటు పలువురిపై అవినీతి ఆరోపణలు చేశారు. సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. లిక్కర్ పాలసీలోని ఆర్థిక అవకతవకలపై ప్రత్యేకంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నది. ఇందులో భాగంగా మనీష్ సిసోడియా, ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల విలువైన ఆస్తులను శుక్రవారం జప్తు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.