ECI protests case : ఢిల్లీ కోర్టు (Delhi court) లో డెరెక్ ఒబెరాయ్ (Derek O’Brien), సాగరిక ఘోష్ (Sagarika Ghose), సాకేత్ గోఖలే (Saket Gokhale) సహా 10 మంది తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేతలకు ఊరట లభించింది. ఆ 10 మంది టీఎంసీ నేతలకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారిలో కొందరికి రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై, మిగతా వారికి రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుతోపాటు అంతే మొత్తంలో నగదును ష్యూరిటీగా తీసుకుని బెయిల్ ఇచ్చింది.
ఆ 10 మంది తృణమూల్ కాంగ్రెస్ నేతలు గత ఏడాది ఏప్రిల్లో భారత ఎన్నికల సంఘం (ECI) ప్రధాన కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన కేసులో నిందితులుగా ఉన్నారు. నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ లెక్కచేయకుండా తృణమూల్ నేతలు ఎన్నికల కార్యాలయం ముందు ఆందోళన చేయడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. మొత్తం 10 మందిని నిందితులుగా పేర్కొంటూ ఢిల్లీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు నిందితులు వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలంటూ గత నెల 21న సమన్లు జారీచేసింది.
దాంతో వారు కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన కోర్టు.. 10 మంది నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. డెరెక్ ఒబెరాయ్, నదీముల్ హాక్, సాకేత్ గోఖలే, సాగరిక ఘోష్, అర్పితా ఘోష్, అభిర్రంజన్ బిశ్వాస్లకు రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. మిగతా నలుగురి నుంచి రూ.10 వ్యక్తిగత పూచీకత్తుతోపాటు అంతే మొత్తంలో నగదును ష్యూరిటీగా పెట్టుకుంది.
అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నేహా మిట్టల్ నిందితుల బెయిల్ పిటిషన్పై విచారణ జరిపారు. కేసు తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు.