న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తన పోర్టల్‌లో ఈ-సైన్(సంతకం) అనే కొత్త ఫీచర్‌ని ప్రారంభించింది. ఇక ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చాలన్నా లేక తొలగించాలన్నా ఆధార్-ముడిపడిన ధ్రువీకరణను ఈసీ తప్పనిసరి చేసింది. ఇదివరకు దరఖాస్తుదారులు తమ గుర్తింపును ధ్రువీకరించుకోవలసిన అవసరం లేకుండా తమ ఓటరు ఫొటో గుర్తింపు కార్డు(ఎపిక్)కు జతచేసిన మొబైల్ నంబర్‌ను ఉపయోగిస్తూ దరఖాస్తు ఫారాలను సమర్పించేవారు. ఈ కొత్త చర్య వల్ల ఓటరు ఐడీలో ఉన్న పేరు ఆధార్ కార్డులో ఉన్న పేరుతో సరిపోలడంతోపాటు ఆధార్‌కు జతచేసిన మొబైల్ నంబర్‌ను ఉపయోగిస్తేనే దరఖాస్తుదారుని ఫారం పరిశీలనకు నోచుకుంటుంది. ఫారం 6(ఓటరు రిజిస్ట్రేషన్), ఫారం 7(చేర్పు/తొలగింపుపై అభ్యంతరం), ఫారం 8(సవరణ) దాఖలు చేసే దరఖాస్తుదారులకు ఇక నుంచి ఈ ధ్రువీకరణ తప్పనిసరి అవుతుంది.
ఇందుకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌పై విమర్శలు గుప్పించారు. మీరు దొంగతనం చేస్తుండగా మేము పట్టుకున్న తర్వాతే మీరు తాళం వేస్తున్నారని ఆయన జ్ఞానేశ్ కుమార్‌ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మేము దొంగలను కూడా పట్టుకుంటామని, సీఐడీకి సాక్ష్యాలు ఎప్పుడు అందచేస్తారో చెప్పండని ఆయన సీఈసీని ప్రశ్నించారు. అనేక రాష్ర్టాలలో వ్యవస్థలను దుర్వినియోగం చేసి ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులు అక్రమంగా జరిగాయని ఇటీవల రాహుల్ పదేపదే ఆరోపించారు.