న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహాసముద్రం అంటార్కిటిక్ ప్రవాహ వేగం తగ్గుతున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. వాతావరణ మార్పులే దీనికి కారణమని, దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు. సముద్ర మట్టాల పెరుగుదల, మహాసముద్రాలు వేడెక్కడం వంటి వైపరీత్యాలు సంభవిస్తాయని చెప్పారు.
అంటార్కిటిక్ సర్కమ్పోలార్ కరంట్ (ఏసీసీ) సవ్య దిశలో ప్రవహిస్తుంది. ఇది గల్ఫ్ ప్రవాహం కన్నా నాలుగు రెట్లు శక్తిమంతమైనది. భూ మండలంలో వాతావరణం అందరికీ అనుకూలంగా ఉండేలా చేయడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తున్నది. మెల్బోర్న్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ నివేదిక ‘ఎన్విరాన్మెంటల్ రిసెర్చ్ లెటర్స్’లో ప్రచురితమైంది.