న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్సీఆర్లోని వివిధ ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున 5.36 గంటలకు భూకంపం సంభవించింది. ఆ తర్వాత కొన్ని గంటలకే బీహార్‌లోనూ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. ఢిల్లీలోని దౌలా కువాన్‌లో గల దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సమీపంలో హూమిలో 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు జాతీయ భూకంపాల పరిశోధనా కేంద్రం తెలిపింది.
చెరువు సమీపంలో ఉన్న ఆ ప్రాంతంలో ప్రతి రెండు, మూడేళ్లకు చిన్న, తక్కువ స్థాయి తీవ్రతతో భూప్రకంపాలు చోటుచేసుకుంటున్నాయి. 2015లో ఈ ప్రాంతంలో 3.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం సంభవించినపుడు భూమి లోపల నుంచి భారీ శబ్దం వినిపించినట్టు భూకంప కేంద్ర అధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లో భూమి కంపించడంతో ఎత్తయిన భవనాల్లో ఉన్న ప్రజలు తమ నివాసాల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. మళ్లీ భూప్రకంపనలు వస్తాయన్న భయంతో ప్రజలు తమ ఇళ్ల బయటే నిలబడి ఉండడం అనేక చోట్ల కనిపించింది.