Eagle | తిరువనంతపురం : అదేదో మామూలు పరీక్ష కాదు.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న రాత పరీక్ష. అలాంటి పరీక్షకు వెళ్తున్న క్రమంలో అభ్యర్థి హాల్ టికెట్ మాయమైతే ఎలా ఉంటుంది.. తీవ్రమైన ఆందోళన ఉంటుంది. ఇన్నాళ్లు చదివిన చదవంతా వృధా అయిపోతుందని బాధపడుతారు.
అయితే ఓ మహిళా అభ్యర్థి హాల్ టికెట్‌ను పరీక్షకు కొన్ని నిమిషాల ముందు ఓ గద్ద ఎత్తుకెళ్లింది. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. గద్ద హాల్ టికెట్ ఎత్తుకెళ్లడాన్ని చూసి అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన కేరళలోని కాసర్‌గడ్‌లో చోటు చేసుకుంది.
కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇటీవల రాతపరీక్షలు నిర్వహించింది. ఓ మహిళా అభ్యర్థి పరీక్ష రాసేందుకు తనకు కేటాయించిన ఎగ్జామ్ సెంటర్ వద్దకు చేరుకుంది. ఇక తన హాల్‌టికెట్‌ను సరిచూసుకుంటుండగా.. అంతలోనే ఓ గద్ద వచ్చి ఎత్తుకెళ్లింది. అక్కడే ఉన్న ఓ కిటికీపై హాల్ టికెట్నుపట్టుకుని గద్ద కూర్చుంది. పరీక్షకు సమయం అవుతుండడంతో.. బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురైంది. చివరి క్షణంలో ఆ గద్ద హాల్‌టికెట్‌ను ఆమెకు అప్పజెప్పింది. దీంతో ఊపిరి పీల్చుకున్న బాధితురాలు హాల్ టికెట్ తీసుకొని గబగబ ఎగ్జామ్ సెంటర్లోకి పరుగెత్తింది.