న్యూఢిల్లీ : ఇటీవల కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఈ-20 పెట్రోల్ వల్ల నష్టపోతున్న ఒక్క వాహనదారుడిని చూపించాలని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. తాజాగా సీ వోటర్ సర్వేలో ఎన్డీయేకు మద్దతుగా ఉండే 52.5 శాతం మంది ఓటర్లు ఈ-20 పెట్రోల్‌ను వ్యతిరేకిస్తున్నట్టు తేలింది. వీరంతా ఈ-20 పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గిపోవడం, రిపేర్లు పెరగడం లాంటి కారణాలను వెల్లడించినట్టు సర్వే తెలిపింది. ఇందులో కేవలం 18.1 శాతం మంది మాత్రమే ఈ-20 పెట్రోల్‌ను సపోర్టు చేస్తున్నారు. మిగిలిన 29.5 శాతం మంది ఎటూ తేల్చలేదు.
ఇక ప్రధాన ప్రతిపక్షానికి మద్దతుగా ఉండే ఓటర్లలో 57.9 శాతం మంది ఈ-20 ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన ఓటర్లలో 55శాతం మంది వద్దంటున్నారు. మొత్తంగా ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 55.1 శాతం మంది ఈ-20 వద్దని చెప్పారు.. కేవలం 17.1 శాతం మంది మాత్రమే మద్దతు తెలపడం గమనార్హం. మిగిలిన వారు ఎటూ సమాధానం చెప్పలేదు. నితిన్ గడ్కరీ ఒక్కరినైనా చూపించాలని సవాల్ చేస్తే.. సొంత పార్టీకి మద్దతు దారులే వ్యతిరేకించడం ఇక్కడ ఈ-20తో ఉన్న నష్టాలను గుర్తు చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.